పెండింగ్ పనుల‌ను వేగంగా పూర్తి చేయాలి: ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నిర్వహించిన వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై విస్తృత సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన, డీసీ బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీఎంసీ వివిధ విభాగాల అధికారులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం ద్వారా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని, పనులలో అలసత్వం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.

మయూరి నగర్ కాలనీలో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో పార్కును సుందరంగా అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే తరహాలో మియాపూర్ వార్డు పరిధిలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కమిషనర్‌తో చర్చించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడం, అసంపూర్తిగా మిగిలిన పనులకు నిధులు మంజూరు చేయడం, సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం, పనుల వేగం పెంచడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అసంపూర్తిగా ఉన్న నాలాల విస్తరణ పనులను పూర్తి చేసి, వర్షపు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి కాలనీలో పార్కుల అభివృద్ధి, సుందరీకరణ చేపట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కోరారు.

మియాపూర్ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆరెకపూడి గాంధీ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీకాంతిని, ఈఈ గోవర్ధన్, డీఈ రూపాదేవి, డీఈ దుర్గాప్రసాద్‌తోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here