విద్యార్థుల‌ సమస్యలపై యుఎస్ఎఫ్ఐ ఛలో సెక్రటేరియట్

శేరిలింగంప‌ల్లి, జూన్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా యుఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టులను సంఘం తీవ్రంగా ఖండించింది. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరంలో అయినా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశించినప్పటికీ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, హాస్టళ్ల సమస్యలు, స్కాలర్‌షిప్‌ల పెండింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది కొరతను వెంటనే తీర్చాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాల‌ని, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాల‌ని, ప్రకటించిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వెంటనే అమలు చేయాల‌ని, బాసర ట్రిపుల్ ఐటీతోపాటు రాష్ట్ర యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాల‌ని, పేద విద్యార్థులకు టెక్నికల్ విద్య అందుబాటులోకి తీసుకురావాల‌ని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు సంబంధించిన పెండింగ్ ఫీజులను విడుదల చేయాల‌ని, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పంపిణీ కాని పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను వెంటనే అందించాల‌ని అన్నారు. ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ముందు నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సుమారు 50 మంది యుఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సంఘం తెలిపింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధుతోపాటు పలువురు నాయకులను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొంది.

ఈ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.యుఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల అరెస్టులను ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ కూడా ఖండించింది. విద్యా సమస్యల పరిష్కారం, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే న్యాయమైన డిమాండ్లతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను వెంటనే విడుదల చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నార్ల చంద్రశేఖర్, ఎం. అరుణ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని యుఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here