శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, దేశ ఐక్యత కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని పటేల్‌కుంట పార్క్ ఎదురుగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశమంతా ఒక్కటిగా ఉండాలనే లక్ష్యంతో పోరాడిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు.

ఒక్కటే దేశం, ఒక్కటే రాజ్యాంగం, ఒక్కటే జెండా అనే సిద్ధాంతం కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదనే భావజాలాన్ని బలంగా వినిపించిన మహనీయుడిగా ఆయనను స్మరించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని ముఖర్జీ చేసిన ఉద్యమం దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్న రవికుమార్ యాదవ్, ఆయన ఆశయాలకు అనుగుణంగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేసిందని అన్నారు. ముఖర్జీ చేసిన త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి, జాతీయతా భావాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





