శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్ల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. చందానగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంలో ఏఐఆర్‌వో, మియాపూర్ సర్కిల్ ఉపకమిషనర్ జి.శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్లు (ALMTs) శిక్షణను నిర్వహించి, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఓటరు జాబితాల నిర్వహణలో కచ్చితత్వాన్ని నిర్ధారించడం, ఓటరు వివరాల పరిశీలన, సవరణలు, నవీకరణ ప్రక్రియలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతను పాటిస్తూ ఓటరు జాబితాలను తప్పులులేకుండా రూపొందించడంలో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలని డీసీ శ్రీనివాస్ సూచించారు. ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను శిక్షణలో వివరించారు.





