శ్రీ లక్ష్మీనగర్ సమస్యల పరిష్కారానికి కృషి: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, జూన్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్ కాలనీ వాసులు కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప్పలపాటి శ్రీకాంత్, శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు త్వరలో పర్యటిస్తానని తెలిపారు. సమస్యలను గుర్తించి విడతల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో మియాపూర్ డివిజన్‌లో అత్యవసరంగా అవసరమైన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య తన దృష్టికి వచ్చినా తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యమని చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఈశ్వర్ నాయుడు, నరేష్ బాబు, బాలు చౌదరి, సాంబయ్య, రత్నకిషోర్, రాజబాబు, హనుమంతరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here