శేరిలింగంపల్లి, జూన్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్ల శేఖర్ రెడ్డి పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషి, వినూత్న ఆలోచనలు, నిరంతర పోరాటాన్ని కొనియాడారు. సామాజిక న్యాయం, యువత సాధికారత, రైతుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి వంటి అంశాల పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు.

సాధారణ ప్రజల సమస్యలను నిరంతరం ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ అహర్నిశలు శ్రమిస్తున్నారని కట్ల శేఖర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఆయన మరింత కీలక పాత్ర పోషించి, దేశ ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ఎదుగుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటూ రాహుల్ గాంధీకి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.






