మోదీ పాల‌న‌లోనే దేశాభివృద్ధి: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూన్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జ్ రవికుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ దిశగా ముందుకు సాగిందన్నారు. 2014లో రూ.258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ ప్రస్తుతం రూ.5,336 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సుమారు రూ.80 కోట్లు కేటాయించి పనులు చేపట్టడం కేంద్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని అన్నారు.

రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణం కొనసాగుతోందని, 1,719 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.38,927 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. అలాగే రూ.62 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 99 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడం, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, రూ.70 లక్షల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలు మోదీ ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా రాజీ పడలేదని అన్నారు. స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించిందన్నారు. రోజుకు సగటున 34 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, చీనాబ్ బ్రిడ్జ్, అటల్ టన్నెల్, పంబన్ బ్రిడ్జ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 164 దాటిందని, విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 164కు పెరిగిందని తెలిపారు. స్టార్టప్ ఇండియా ద్వారా 2.06 లక్షల స్టార్టప్‌లు, 120 యూనికార్న్‌లు ఏర్పడ్డాయని, యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయని చెప్పారు. మౌలిక సదుపాయాలపై వ్యయం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12.2 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. గత 12 ఏళ్లలో దేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని, రైతులు, మహిళలు, యువత, పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఇదే అభివృద్ధి వేగం కొనసాగాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, కేశవులు, అనిల్ గౌడ్, రామరాజు, కాంచన కృష్ణ, పద్మ, జితేందర్, మహేష్ యాదవ్, మణిభూషణ్, మాణిక్‌రావు, రాజు శెట్టి, దుర్గాప్రసాద్, గణేష్, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here