మియాపూర్‌లో సీఎం సభ, ఫ్లైఓవర్ శంకుస్థాపన.. భారీ ట్రాఫిక్ ఆంక్షలు..

శేరిలింగంప‌ల్లి, జూన్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్‌లో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభతోపాటు మియాపూర్ ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. ఈ కార్యక్రమాలు సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మియాపూర్ బస్ స్టాప్ సమీపంలోని శివాలయం వద్ద జరిగే కార్యక్రమాల కారణంగా జాతీయ రహదారి-65 (ఎన్‌హెచ్-65)తోపాటు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా వాహన రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు తరలిరానుండటంతో ట్రాఫిక్ ఒత్తిడి పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా సోమవారం సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9:00 గంటల మధ్య మియాపూర్ ప్రాంతంలోని ప్రధాన మార్గాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని, భద్రతా నిబంధనలను పాటించడం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతోపాటు ప్రజల భద్రతను కాపాడేందుకు తోడ్పడాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. అలాగే వాహనదారులు సురక్షితంగా ప్రయాణించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here