శేరిలింగంపల్లి, జూన్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణను కేవలం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కాకుండా ప్రపంచం వైపు చూసే రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, రహదారి విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జూన్ 8న మియాపూర్ మెట్రో వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వేదిక, ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చైర్మన్ చల్లా నరసింహా రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్, కుత్బులాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ, సాగునీరు, సంక్షేమ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు జూన్ 8న వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.





