శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె.జయశంకర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయాల సాధన కోసం సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రజల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని, విద్య, ఉద్యోగాలు, వైద్యం వంటి రంగాల్లో సామాజిక న్యాయం అమలు కావాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి బీసీలకు 42 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి అంశాల్లో ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినా పేదరిక నిర్మూలన, ఉద్యమకారుల సంక్షేమం వంటి అంశాల్లో ఇంకా పూర్తి న్యాయం జరగాల్సి ఉందన్నారు. సామాజిక, ఆర్థిక తెలంగాణ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం శేరిలింగంపల్లిలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు ఐకమత్యంతో జీవించాలని, వారి సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి వ్యాయామం, నడక అలవాటు చేసుకుని ఆనందంగా జీవించాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో ఆర్కే సాయన్న ముదిరాజ్, అందెల కుమార్ యాదవ్, హరికృష్ణ చారి, మల్లికార్జున్ శర్మ, గోవింద్, సాయిలు, బాల్‌రాజ్, రమేష్, కిరణ్, ముచ్చర్ల రవీందర్, బీరకోట శేఖర్, పరశురాం, నరేష్, మనోజ్ ముదిరాజ్, కృష్ణ గౌడ్‌తోపాటు పలువురు సామాజిక సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.





