శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను నాయకులు గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ బుందారం నరసయ్య గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల పరిరక్షణే తెలంగాణ ఆవిర్భావ లక్ష్యమని తెలిపారు. ఆ ఆశయాల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, యువత తెలంగాణ చరిత్రను తెలుసుకుని సమాజ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వనం పద్మ, ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌తోపాటు జహంగీర్, సంతోష్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





