శేరిలింగంపల్లి, మే 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఇంజినీరింగ్ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ సర్కిళ్లు, వార్డుల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులు, బీటీ రోడ్ల పునరుద్ధరణ పనుల పురోగతిపై సమీక్షించారు. అలాగే స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, వరద నివారణ చర్యల అమలు, పార్కుల సుందరీకరణ, కొత్త పార్కుల ఏర్పాటు, వాకింగ్ ట్రాక్లు, ఆట వస్తువుల ఏర్పాటుకు సంబంధించిన పనులపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా కమ్యూనిటీ హాళ్లు, పబ్లిక్ టాయిలెట్లు, స్ట్రీట్ లైట్లు తదితర పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులతోపాటు జోన్ పరిధిలో కొనసాగుతున్న ఇతర ప్రజోపయోగ ప్రాజెక్టుల పురోగతిని కూడా సమీక్షించారు.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని, ప్రాజెక్టుల అమలులో పారదర్శకత పాటించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





