మయూరి నగర్‌లో 102 సీసీ కెమెరాలు ప్రారంభం

శేరిలింగంపల్లి, మే 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.16 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 102 సీసీ కెమెరాలను PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ రితీరాజ్, అడిషనల్ డీసీపీ సుదర్శన్, ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, సీఐ శివ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తన విజ్ఞప్తికి స్పందించి కాలనీ వాసులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒకేసారి 102 సీసీ కెమెరాలను ప్రారంభించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. కాలనీ కుటుంబ సభ్యులు ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కాలనీల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ముఖ్య కూడళ్లు, పార్కులు, బ్లాక్ స్పాట్లలో తప్పనిసరిగా కెమెరాల‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని పేర్కొంటూ, కేసుల పరిష్కారంలో, నేర శోధనలో, నేర నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజల్లో సీసీ కెమెరాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని గాంధీ తెలిపారు. ప్రతి కాలనీ, బస్తీలో 24 గంటలు పనిచేసే నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత, ప్రజల రక్షణ, దొంగతనాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు అత్యంత కీలకమని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తన వంతు సహకారంగా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా రూ.1 కోటి నిధులు కేటాయించినట్లు తెలిపారు. అన్ని కాలనీల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మియాపూర్ డివిజన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here