శేరిలింగంపల్లి, మే 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లో అఖిలభారత మందుల వర్తకుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం స్థానిక మందుల వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో ఒక రోజు బంద్ నిర్వహించారు. ఈ బంద్కు ప్రధాన కారణం ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేకుండా సాగుతున్న మందుల విక్రయాలపై వ్యతిరేకత వ్యక్తం చేయడమేనని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సమాఖ్య నాయకులు ఉమాకాంత్, సుధీర్, మల్లేష్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మత్తునిచ్చే మందులు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల యువత మత్తు బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మత్తు రహిత రాష్ట్రం లక్ష్యానికి ఈ విధానం విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు మందులు సులభంగా అందుబాటులో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని వెసులుబాట్లు కల్పించిందని, అయితే ఆ అవకాశాన్ని ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చుకుని చిన్న వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.

అందువల్ల కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన వెసులుబాట్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కార్పొరేట్ మెడికల్ షాపులు భారీ రాయితీల పేరుతో సాధారణ మందుల దుకాణాలపై అన్యాయ పోటీ సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్కడ కొనుగోలు చేసినా మందులకు ఒకే విధమైన ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా నకిలీ, నాణ్యతలేని మందుల సరఫరాపై ఆందోళన వ్యక్తం చేసిన వారు, ఇటువంటి మందులపై కఠిన నిఘా పెట్టి పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.





