శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో తక్కువ కోతతో చేసే అధునాతన గుండె శస్త్రచికిత్సలు గతేడాదితో పోలిస్తే 34 శాతం పెరిగాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో గుండె ప్రధాన కవాటం ఇరుకుగా మారే అయోర్టిక్ స్టెనోసిస్ సమస్యకు ట్రాన్స్‌క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (టావర్) చికిత్స విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఏటా 350 నుంచి 400 వరకు టావర్ సర్జరీలు జరుగుతున్నాయి. ఆయాసం, అలసట, ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలను వృద్ధాప్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయరాదని ఏఐజీ హాస్పిటల్స్ కార్డియాక్ క్యాత్ ల్యాబ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనుజ్ కపాడియా, క్యాత్ ల్యాబ్ కో-డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ భరడి సూచించారు. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందాల కృషితో గతంలో శస్త్రచికిత్సకు అత్యంత ప్రమాదకరంగా భావించిన రోగులకు సైతం ఇప్పుడు టావర్ విధానం ద్వారా సురక్షితంగా వైద్యం అందిస్తున్నామని, తద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారని వారు వివరించారు.






