తెల్లాపూర్‌లో సీఎంసీ కమిషనర్ సృజ‌న‌ క్షేత్రస్థాయి తనిఖీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రతిరోజూ ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న శేరిలింగంపల్లి జోన్ ప‌రిధిలోని పటాన్‌చెరు సర్కిల్ తెల్లాపూర్ వార్డులో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (RWAs), స్థానిక నివాసితులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై, క్షేత్రస్థాయిలో నెల‌కొన్న పౌర సమస్యలను సమీక్షించారు. దెబ్బతిన్న రోడ్డు మార్గాలను గుర్తించారు. ప్రాధాన్యత క్రమంలో ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వెలగని వీధి దీపాలు, కొత్తగా దీపాలు అవసరమైన ప్రాంతాలను గుర్తించారు. ఎటువంటి జాప్యం లేకుండా వీధి దీపాల మరమ్మత్తులు, ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల ప‌రిశుభ్ర‌త‌ (Sweeping), చెత్త తొలగింపులో లోపాలను గమనించారు. క్రమం తప్పకుండా స్వీపింగ్ చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, చెత్త నిల్వ ఉండే ప్రాంతాలను (GVPs) పర్యవేక్షించాలని ఆదేశించారు. నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజీ అడ్డంకులు, అస్తవ్యస్తంగా ఉన్న నెట్‌వర్క్‌ను గమనించారు. అడ్డంకులను తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు.

ట్రాఫిక్ రద్దీ సమస్యలపై దృష్టి సారించారు. ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ మార్కింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. పాదచారులకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను గుర్తించారు. ఆక్రమణలను తొలగించి, పాదచారుల భద్రతను నిర్ధారించాలని ఆదేశించారు. నీటి సరఫరా సమస్యలపై స్పందిస్తూ, జలమండలి (HMWSSB) అధికారులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కీలక ప్రాంతాల్లో నిఘా అవసరమని గుర్తించారు. సీసీటీవీ (CCTV) కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం, రహదారులు దెబ్బతినడానికి కారణమవుతున్న ఆర్‌ఎంసీ (RMC) యూనిట్లపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. నిబంధనలు పాటించని యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. తెల్లాపూర్‌లోని 45 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. పౌరులందరూ జనగణన (Census) స్వయం నమోదు ప్రక్రియలో పాల్గొనాలని, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ వారిని ప్రోత్సహించారు. ఆమోదించిన పనులు క్షేత్రస్థాయిలో త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చూడాలని, నిర్ణీత కాలపరిమితిని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here