శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కమిషనర్ సృజన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు తాము చేసిన ఫిర్యాదులకు యూనిక్ ట్రాకింగ్ ఐడీ కేటాయించబడుతుందని, దాంతో పౌరులు తమ ఫిర్యాదు స్థితి ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చని ఆమె అన్నారు. కాగా ప్రజావాణికి మొత్తం 44 ఫిర్యాదులు అందగా, టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 34 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఇంజినీరింగ్ విభాగానికి 5, రెవెన్యూ 2, పారిశుధ్ద్యం 1, యూసీడీ 1, అడ్వర్టయిజ్మెంట్ విభాగానికి 1 ఫిర్యాదు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ఆమె వివరంగా సమీక్షించారు. వాటిని నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదు అందినప్పటి నుండి పరిష్కారం అయ్యే వరకు ప్రతి దశలోనూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, పనుల్లో జాప్యం ఉండకూడదని కమిషనర్ ఆదేశించారు.






