శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతోపాటు మౌలిక వసతులు, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ బానోత్ కేశురాం గోపీ నగర్, నెహ్రూ నగర్ బస్తీలలో పర్యటించారు. శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజగం కేశవులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కాటా నరసింహ గౌడ్, బిజెపి జిల్లా నాయకుడు రాకేష్ దూబే, పలువురు బస్తీ నాయకులు పాల్గొని స్కూలు, కళాశాల విద్యార్థులకు సంక్షేమ విద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీలపై అవగాహన కల్పించారు.






