శిల్పారామంలో ఘ‌నంగా ప్రారంభ‌మైన నృత్య స‌మ్మేళ‌నం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో కందుల కూచిపూడి నాట్యాలయం, శిల్పారామం ఆధ్వర్యంలో నృత్య సమ్మేళనం – 2026 కార్య‌క్ర‌మాన్ని శుక్రవారం యాంపీ థియేట‌ర్‌లో ఘనంగా ప్రారంభించారు. రెండు రోజుల ఈ ఉత్సవంలో భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక మహోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. మొదటి రోజు దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రతిభావంతులైన కళాకారులు స్వాతి ఆత్మనాథన్ (బెంగళూరు) భరతనాట్యం, గాయత్రి భూపతి (చెన్నై) ఒడిస్సి, ప్రసాంత్ (నిజామాబాద్) పేరిణి, రవి శిష్య బృందం కూచిపూడితో ప్రేక్షకులను అలరించారు. భారతీయ శాస్త్రీయ నృత్యరూపాల‌ను ఈ వేదికపై సజీవంగా ఆవిష్కృతం చేశారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గురువు వేదాంతం సత్యనర్సింహ శాస్త్రి, ఉమా మహేశ్వర పాత్రులు, కాజా నీరజ, దేబశ్రీ, ఉస్తాద్ పేరిణి రాజ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ నృత్య సమ్మేళనం యువ కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలవడంతో పాటు భారతీయ నాట్య సంప్రదాయాల పరిరక్షణకు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా కందుల కూచిపూడి నాట్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు గురు రవి కూచిపూడి మాట్లాడుతూ ఈ నృత్య సమ్మేళనాన్ని నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here