శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ మహాత్మా బసవేశ్వరుడు సమానత్వం, సత్యం,సేవకు ప్రతీక అని, ఆయన కేవలం ఒక మతపరమైన గురువు కాదు, ఆయన ఒక గొప్ప సమాజ మార్గదర్శి అని, సమానత్వం, సేవ, నిజాయితీ వంటి విలువలను మన జీవన విధానంలో నిలబెట్టుకోవాలని బోధించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో నియోజకవర్గం నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుడు భారతదేశ చరిత్రలో గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి అని అన్నారు. ఆయన 12వ శతాబ్దంలో జీవించి, సమాజంలో ఉన్న అన్యాయాలు, కులవ్యవస్థ, అసమానతలపై పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నేపల్లి సాంబశివ రావు, రాంచందర్ గౌడ్, కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, రవి కుమార్ గౌడ్, రాంబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.






