శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకి వెంటనే పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి మహిళలపై ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటే పదే పదే అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ దేశంలో 80 ఏళ్ల పాటు అధికారంలో ఉందని, అయినప్పటికీ ఆ పార్టీ ఏనాడూ ప్రజల కోసం పనిచేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మహిళలపై ప్రేమ ఉంటే బిల్లును వెంటనే ఆమోదించేలా మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాయకులు బిల్లులను అడ్డుకోవాలని పదే పదే ఢిల్లీకి ప్రయాణం అవుతారని, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. బిల్లును అడ్డుకుంటే తెలంగాణలోనే కాదు, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా కనుమరుగవుతుందని అన్నారు.






