శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం లేని సమాజం ఒక మృతదేహంతో సమానం అని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గంగాల రాధాకృష్ణన్ యాదవ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ లేబర్ అడ్డా, ఇజ్జత్ నగర్ కాలనీ, ఖానామెట్ చౌరస్తా, భిక్షపతి నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సేవ చేయడం తనకు ఆనందంగా అనిపించిందని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికీ సమానత్వం, న్యాయం అందాలని అంబేద్కర్ చూపిన మార్గం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.






