శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): స్విమ్మింగ్ పూల్లో మునిగి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ఎన్క్లేవ్ లోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ కుమారుడు తేజేశ్వర్ నీరజ్ పేరం (13) స్థానికంగా ఉన్న ఫెదర్ ఎన్ స్ల్పాష్ స్విమ్మింగ్ పూల్లో ఈ నెల 11వ తేదీన ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. తరువాత చాలా సేపటి వరకు ఎవరూ గమనించలేదు. ఈ క్రమంలో అతన్ని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం అనుపమ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆ బాలుడికి ఎమర్జెన్సీ సీపీఆర్ నిర్వహించారు. అయితే బాలుడు కార్డియాక్ అరెస్ట్ అయి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తన కుమారుడి మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.






