కేశ‌వ‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల అభివృద్ధికి కృషి: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ్ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన దురదృష్టకర సంఘటనపై మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణ స్పందన వ్యక్తం చేశారు. సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా సెల్లార్ తవ్వకాల నుంచి తీసిన మట్టిని స్కూల్ ప్రహరీ గోడకు ఆనించి వేయడం వల్ల గోడ కూలిపోవడంతోపాటు కిచెన్ గది కూడా తీవ్రంగా దెబ్బతింద‌ని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న గంగాధర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించి సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో చర్చలు జరిపారు. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణమే తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే కూలిన ప్రహరీ గోడ, కిచెన్ గదిని నాణ్యమైన ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అదనంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణ సంస్థలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో భద్రతా చర్యల‌ను బలోపేతం చేయడం, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టడం ముఖ్యమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం, శుభ్రత, భద్రత, తాగునీటి సదుపాయాలు, తరగతి గదుల మరమ్మత్తులు వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలపరచడం తమ బాధ్యతగా భావిస్తున్నామని గంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు గంగాధర్ రెడ్డి తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాఠశాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవ నగర్ ప్రధానోపాధ్యాయురాలు సునీత, స్థానిక నేతలు, కేశవ నగర్ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here