శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): కట్నం తేవాలని భర్త గురి చేస్తున్న వేధింపులకు తాళలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ శివ ప్రసాద్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇషిక యాదవ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీరజ్ బన్సాల్‌కు 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి అది ముందుగా స్నేహంగా మొదలై తరువాత ప్రేమగా మారింది. అనంతరం పెద్దలను ఒప్పించి వారు ఈ ఏడాది ఫిబ్రవరి 20న వివాహం చేసుకున్నారు. అనంతరం నూతన దంపతులు మియాపూర్‌లోని మక్తా మహబూడ్ పేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల నీరజ్ తనకు కట్నం కావాలని డిమాండ్ చేస్తూ భార్య ఇషిక యాదవ్‌ను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ వేధింపులను తట్టుకోలేని ఆమె తీవ్ర మనస్థాపానికి గురై తమ ఫ్లాట్‌లోని హాల్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






