శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ బ్లాకు, రాజా రాజేశ్వరి నగర్, గోల్డెన్ తులిప్, రాఘవేంద్ర నగర్, డైమండ్ హిల్స్ కాలనీలలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ కాలనీలలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. హమీద్ పటేల్ ప్రతి మండపం వద్దకు వెళ్లి భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ ధర్మానికి ప్రతీకగా, సత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన శ్రీరాముడి అవతార దినం ఈ పవిత్ర శ్రీరామనవమి పండుగ పర్వదినమని అన్నారు. రామరాజ్యం అంటేనే అందరూ సుఖసంతోషాలతో ఉండటమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో విరాజిల్లాలని ఈ సందర్బంగా ఆకాంక్షించారు.






