శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): 6 గ్యారంటీలు, 66 హామీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు ఉధృతం చేయాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు 6 గ్యారంటీలు, 66 హామీల పేరుతో ప్రజలను మోసగించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరచి మాయ మాటలతో పబ్బం గడుపుతున్నారని ఆరోపిస్తూ వారి తీరుకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి, కొండాపూర్ , లింగంపల్లి, హఫీజ్ పేట్, మియాపూర్ డివిజన్ల నాయకులు స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికుమార్ యాదవ్ బీజేపీ శ్రేణులతో కలిసి ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అందుకు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమీ లేదని, రాష్ట్ర ప్రజలను , ప్రజల ఆస్తులను ఆగం పట్టిస్తున్నారని అన్నారు. ఎన్నో అలివికాని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేవరకు ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు ఇలా ప్రజల తరపున బీజేపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఎల్లేష్, జితేందర్, లక్ష్మణ్ ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్, ఆంజనేయులు సాగర్, రమేష్ , విభూషణ్ రెడ్డి, విష్ణు దత్, వెంకటేష్, గణేష్ ముదిరాజ్ , రాము, శ్రీనివాస్ యాదవ్, పద్మ , విజయలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






