శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ , మినిస్ట్రీ అఫ్ టెక్స్‌టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో గాంధీ శిల్ప బజార్ హస్తకళా ఉత్పత్తుల మేళాను ఏర్పాటు చేయగా, అందులో ప్రదర్శిస్తున్న ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. బాతిక్ పెయింటింగ్, కలంకారీ పెయింటింగ్, మధుబని పెయింటింగ్, టెర్రకోట జ్యువలరీ, వెదురు బుట్టలు, ఇతర ఎన్నో హస్తకళా ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇంద్రాణి, ఉదయ్ కృష్ణ తమ కూచిపూడి నృత్య ప్రదర్శనలో నటేశ కౌతం, కామాక్షి స్తుతి, కొలువైతివారంగా సాయి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. భరతనాట్య ప్రదర్శనలో రమ్య ప్రదీప్, డాక్టర్ ఆనంద్ మీనన్, శారణ్యలు పుష్పాంజలి, అర్ధనారీశ్వర అష్టకం, ఆంజనేయ కీర్తనం, అన్నమయ్య కృతి, దేవి స్తుతి, అభంగ్ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. ప్రముఖ నాట్య గురువు చైతన్య కుసుమ ప్రియ ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను అభినందించారు.






