శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం మేథావులు, విద్యావంతులు సలహాలు, సూచనలు ఇవ్వాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ జలవాయువిహార్ కాలనీ వాసులతో సీనియర్ నాయకుడు, జిల్లా కోశాధికారి కృష్ణం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కి , సమాజంలో మార్పు కోసం సహకరించాలని అన్నారు. 12 ఏళ్ల క్రితం దేశం ఆర్థికంగా 12 వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 4 వ స్థానంలో ఉన్నామని అన్నారు.

దేశం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు ఆలోచించి అందరికీ తెలియజేయాలని అన్నారు. భారత్‌ను అనేక రంగాల్లో శక్తివంతంగా మారేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను విద్యావంతులు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను వారికి వివరించారు. కాలనీలో తాగునీటి సమస్య ఉందని, ట్రాఫిక్ రద్దీ పెరిగిందని, దోమలు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని చెప్పడంతో స్పందించిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ఆంజనేయరాజు, కాలనీ కమిటీ సభ్యులు పివి రావు, వివేక్, ఫణి జయ బాబు, హెచ్ఎంటి శాతవాహన నుంచి నర్సింగ్ రావు, సురేష్ , ఎస్వీఎస్ రాజు, అడ్డగుట్ట సొసైటీ నుంచి కోటేశ్వరరావు, సుబ్బారావు, రామానుజ రెడ్డి, బిజెపి నాయకులు నవీన్ గౌడ్ , వేణు యాదవ్ , సీతారామరాజు, బద్రి, సైదులు, శేషయ్య, ఎంకే దేవ్, బాలకృష్ణ, వెంకట్, రాము, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.





