శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి కోసం చిన్నచిన్న షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద వ్యాపారులను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జిహెచ్ఎంసి అధికారులు తొలగించడం అత్యంత బాధాకరమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్లపై జీవనోపాధి కోసం చిన్నచిన్న షాపులు పెట్టుకుని జీవించేవారిని ఒక్కసారిగా నేలమట్టం చేయడం కుటుంబాల పొట్టపై నేరుగా దెబ్బ కొట్టినట్లేనని ఆయన అన్నారు. ప్రతి చర్యకు ముందు తప్పనిసరిగా నోటీసు ఇవ్వడం, వారికి ప్రత్యామ్నాయాలు , అవకాశం కల్పించడం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు.

జీవనోపాధి హక్కు రాజ్యాంగం ఇచ్చిన హామీ అని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివారని, వారిని రక్షించడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తొలగింపు చర్యలకు బదులుగా పునరావాసం, పరిరక్షణ మార్గాలు చూపాలని, అవసరమైతే ఆర్థిక సహకారం అందించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డివివి సత్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న వ్యాపారులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన శ్రామికులేనని, వారి కడుపు కొట్టే చర్యలు చేయకూడదని, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీసీల సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





