శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయంతోపాటు నార్సింగి , అమీన్పూర్ , పటాన్చెరు, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 24 వినతులు అధికారులకు అందాయి . ఇందులో జోనల్ కార్యాలయంలో 5, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 8, నార్సింగ్ సర్కిల్ కార్యాలయంలో 3 , మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో 5, అమీన్పూర్ సర్కిల్ కు 3 చొప్పున వినతులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతిపత్రం రూపంలో అందించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు.






