న్యాయ విద్యలో అశోక్ రెడ్డి అసాధారణ ప్రతిభ

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): న్యాయ విద్యలో కేవలం పట్టా సాధించడమే కాకుండా, తన అసాధారణ మేధస్సు, వాదనా పటిమతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు అనంత్ న్యాయ కళాశాల విద్యార్థి అశోక్ రెడ్డి తిప్పని. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఎల్‌ఎల్‌బీ (2022-25) పట్టాను స్వీకరించారు. నిరంతర కృషి, క్రమశిక్షణ ఉంటే న్యాయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అశోక్ రెడ్డి తన ప్రస్థానంతో నిరూపిస్తూ, యువ న్యాయ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇటీవల అనంత్ న్యాయ కళాశాల నిర్వహించిన మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ పోటీల్లో అశోక్ రెడ్డి నేతృత్వంలోని బృందం విశేష ప్రతిభ కనబరిచింది. మొత్తం 24 బృందాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఆయన వాదనా నైపుణ్యం న్యాయమూర్తులను ఆకట్టుకొని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజేత బృందంలో ఇందిర, రెయాతా సభ్యులుగా పాల్గొని సమిష్టి కృషితో విజయాన్ని అందించారు. వాగ్ధాటితోనే కాకుండా, న్యాయపరమైన అంశాలను లోతుగా విశ్లేషించి లిఖితరూపంలో ప్రతిపాదించడంలోనూ అశోక్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పోటీల సందర్భంగా ఆయన రూపొందించిన మెమోరండం అత్యుత్తమంగా నిలిచి ఉత్తమ మెమోరియల్ అవార్డును గెలుచుకుంది. క్లిష్టమైన చట్టపరమైన అంశాలను స్పష్టంగా విశ్లేషించిన ఆయన ప్రదర్శన న్యాయమూర్తుల ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డా. జి.బి. రెడ్డి సమక్షంలో బృందం చూపిన విశ్లేషణాత్మక సామర్థ్యం, మనోధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అశోక్ రెడ్డిలో భావి న్యాయ వ్యవస్థకు దిక్సూచిగా నిలిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగారం, ఓయూ లా ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎన్. వెంకటేశ్వర్లు, కళాశాల కరస్పాండెంట్ రవి అనంత్, ప్రిన్సిపాల్ డా. ఎం.వి. చంద్రమతి చేతుల మీదుగా అశోక్ రెడ్డి పట్టాను స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఉన్నతమైన న్యాయవాదిగా ఎదిగి సమాజానికి, బాధితులకు న్యాయం చేకూర్చడమే తన లక్ష్యమని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here