శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి త్రివేణి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రకృతి టు ప్రోగ్రెస్ సైన్స్ ఎక్స్పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 300 వర్కింగ్ మోడల్స్‌తో విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ ex డైరెక్టర్ కే పుల్లారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్లోబల్ సైన్స్ పోకడలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు రానున్న క్వాంటం సైన్స్, పర్యావరణ హితమైన గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీల ప్రాధాన్యతను ఆయన వివరించారు. పుస్తక జ్ఞానంతో పాటు పరిశోధనాత్మక చింతన కలిగి ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

పాఠశాల ప్రిన్సిపల్ అనితారావు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు 300కు పైగా వర్కింగ్ మోడల్స్‌ను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించినట్లు తెలిపారు. చిరు ప్రాయం నుంచే పరిశోధనా దృక్పథాన్ని అలవాటు చేయడమే స్కూల్ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో భారతీయ సంస్కృతికి, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఉన్న అనుసంధానాన్ని విద్యార్థులు తమ నమూనాల ద్వారా అద్భుతంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో త్రివేణి స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరి, సైన్స్ ఆఫీసర్ సుబ్బారావు, సి ఆర్ ఓ సాయి నరసింహారావు, ఎసీఆర్వో నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.





