శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు అందిస్తున్న మద్దతు, వారి నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామని అన్నారు. వారి పట్టుదల, అంకితభావం, వృత్తి పట్ల వారికి ఉన్న నిబద్ధత తమకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు. సైబరాబాద్ కీర్తి, పేరు ప్రఖ్యాతులకు భంగం కలగకుండా అన్ని విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణగా మెలగాలని కోరుతున్నట్లు తెలిపారు. సైబరాబాద్ సమగ్రతను కాపాడాలని అన్నారు. అన్ని పోలీసు విభాగాలు కలసి సమన్వయంతో పనిచేస్తామని, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత వంటి అంశాల్లో మరింత మెరుగ్గా సేవలను అందిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటామని అన్నారు.






