ఫిరాయింపు దారులపై శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్ర‌హం

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, గెలిపించిన ప్రజలకు, పార్టీకి వెన్నుపోటు పొడిచిన కొంత మంది కార్పొరేటర్ల పాపాలకు నిష్కృతి లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. బుధ‌వారంతో కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు స్థానిక అంబేద్క‌ర్ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజ్యాంగం రాసిన ఆయ‌న‌ సాక్షిగానే రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసిన ఫిరాయింపుదారులను ప్రజలు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా శిక్షించాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి రెండేళ్లు పదవిని అనుభవించి, తీరా అధికారం మారగానే నైతిక విలువలను వదిలేసి కాంగ్రెస్ గూటికి చేరార‌ని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.

అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం)ను వారు తుంగలో తొక్కార‌ని, పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారడం అంటే పరోక్షంగా రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్‌ను అవమానించడమే అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్వలాభం కోసమే ఈ జంపింగ్‌లు జరిగాయని, దీనిని ప్రజలెవరూ హర్షించడం లేదని పేర్కొన్నారు. నేటితో మీ పదవీ కాలం ముగిసింది, రేపటి నుంచి మీరు కూడా మాజీ లే, ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తారు ? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఈ మాజీలకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన వారిని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్ళిన వారిని మళ్లీ డివిజన్లలో అడుగుపెట్టనివ్వొద్దు. ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పండి అని బీఆర్ఎస్ నేతలు ప్రజలను కోరారు. ఇలాంటి వారికి టికెట్లు ఇస్తే చిత్తుగా ఓడించేందుకు శేరిలింగంపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అంబేద్క‌ర్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అధికారం శాశ్వతం కాదని, నమ్ముకున్న సిద్ధాంతం, నిలబడ్డ విలువలెప్పుడూ చరిత్రలో నిలిచిపోతాయని, కానీ ఈ ఫిరాయింపు ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని స్థానిక నేతలు ఎద్దేవా చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here