శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, మౌలిక వసతుల కల్పనే అజెండాగా చందానగర్ డివిజన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, చందానగర్‌ను ఒక ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతానని స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి స్వయంగా అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధానంగా వెంకటాద్రీ నగర్ కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నిర్మిస్తున్న థీమ్ పార్క్ పనులను పరిశీలించి, పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం హుడా కాలనీలో కొత్తగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానికులతో కలిసి పరిశీలించారు. రోడ్డు పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు. పనుల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పని చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.






