శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC పరిధిలోని మియాపూర్ సర్కిల్–48, మదీనాగూడ డివిజన్ శాంతినగర్ కాలనీ, పరిసర ప్రాంతాలలో నెలకొన్న తీవ్రమైన శానిటేషన్ సమస్యలు, స్వచ్ భారత్–స్వచ్ హైదరాబాద్ కార్యక్రమాల అమలులో ఉన్న లోపాలు, పెరుగుతున్న దోమల బెడద పై మదీనాగూడ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు పవన్ కుమార్ ప్రజావాణి వేదికగా ఫిర్యాదు చేశారు.

స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించిన పవన్ కుమార్ దోమల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం పెరిగిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజారోగ్యంపై GHMC అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే మదీనాగూడ డివిజన్‌లో ఫాగింగ్, యాంటీ-లార్వా స్ప్రే, సమగ్ర శానిటేషన్ కార్యక్రమాలను అమలు చేసి ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించాలని పవన్ కుమార్ ప్రజావాణి ద్వారా అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని, అవసరమైతే మరింత ఉద్యమాత్మకంగా స్పందిస్తానని పవన్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.





