పండుగ రోజే టెండర్ల ప్రహసనం.. మైనార్టీల పట్ల అధికారుల నిర్లక్ష్యం: బొబ్బ న‌వ‌తా రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విందు పూర్తయ్యాక విస్తరాకులు ఎత్తినట్లుగా అదే తీరు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కనిపిస్తోందని మాజీ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి విమ‌ర్శించారు. మాతృశ్రీ నగర్ శ్మశాన వాటికను గంగారం సంగారెడ్డి, కార్తిక్ రాయల, పొట్ట నరేందర్ యాదవ్, మహ్మద్ గౌస్ లతో కలిసి ఆమె స్వయంగా పరిశీలించారు. అధికారులు, ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల మనోభావాలతో ఆడుకోవడం మానుకుని, తక్షణమే పనులు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలు అత్యంత పవిత్రంగా భావించే షబ్-ఎ-బరాత్ పర్వదినం జరగనుండగా, శ్మశాన వాటికల శుభ్రత కోసం పిలిచిన టెండర్ల గడువును కూడా మంగ‌ళ‌వారం మధ్యాహ్నం వరకు నిర్ణయించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగ‌ళ‌వారం మధ్యాహ్నం టెండర్లు ఖరారైతే, సాయంత్రం జరిగే పండుగకు ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారని మైనార్టీలు ప్రశ్నిస్తున్నార‌ని న‌వ‌తా రెడ్డి అన్నారు. పండుగ ముగిశాకే శ్మశానాలను శుభ్రం చేస్తారా? స్థానిక ఎమ్మెల్యే, అధికారుల వైఖరి బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా మారింది. నిధులు లేవంటూనే వేల‌ కోట్ల రూపాయల శిలాఫలకాలు వేస్తూ హడావుడి చేసే ప్రజాప్రతినిధులు, ఉన్న నిధులను మైనార్టీల శ్రేయస్సు కోసం సకాలంలో ఎందుకు వినియోగించలేకపోతున్నారు. వారం రోజుల కిందటే పూర్తికావాల్సిన టెండర్ల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా పండుగ రోజుకు తీసుకురావడం వెనుక నిధుల స్వాహా కోసమేనా ఈ చివరి నిమిషం హడావుడి.. అని ప్ర‌శ్నించారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నార‌ని, మాతృశ్రీ నగర్ డివిజన్ ఆదిత్య నగర్ సర్వే నెంబర్ 80లోని ముస్లిం మైనార్టీ శ్మశాన వాటిక పశువుల సంచారంతో అపరిశుభ్రంగా మారిందని, తమ పెద్దల సమాధుల వద్ద ప్రార్థనలు చేసే పవిత్ర స్థలాన్ని కనీసం శుభ్రం చేయించకపోవడం బాధాకరమని వాపోతున్నార‌ని అన్నారు. అధికారులను ప్రశ్నిస్తే రేపు చేస్తాం అంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు టెండర్ల ప్రక్రియను ఎంత అపహాస్యం చేశారో గడువు తేదీలే చెబుతున్నాయని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here