శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పరిధిలోని మక్త మహబూబ్‌పేట్ సర్వే నెంబర్ 44లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై జిహెచ్ఎంసి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి వేదికగా ఐదు సార్లు ఫిర్యాదులు చేసినా, వాటిని పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులు గతంలో సీజ్ చేసిన భవనాలపై పెట్టిన సీజింగ్ బోర్డులను తొలగించేందుకు పరోక్షంగా అనుమతి ఇస్తున్నారని, ఆ తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, అక్రమ భవనాల్లో గృహప్రవేశ కార్యక్రమాలు కూడా జిహెచ్ఎంసి అధికారుల సమక్షంలోనే నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టిన అధికారులు, బిల్డర్లకు కోర్టు ఆర్డర్లు తెచ్చుకోవాలని సూచనలు ఇస్తూ, వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సీజింగ్ బోర్డులు తొలగించి నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా, ఎలాంటి భయభ్రాంతులు లేకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ తీరుతో జిహెచ్ఎంసి అధికారులు ప్రజల కోసం కాకుండా బిల్డర్ల కోసమే పని చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేయకుండా తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ, నోటీసులు చూపించి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులపై విజిలెన్స్ విభాగం, యాంటీ కరప్షన్ బ్యూరో దృష్టి సారించాలని కోరారు.
ఈ వ్యవహారంపై శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, మియాపూర్ సర్కిల్-48 ఏసీపీ తక్షణమే స్పందించి, సీజ్ చేసిన భవనాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న ఇతర భవనాలను కూడా అక్కడికక్కడే సీజ్ చేయాలని అన్నారు. సర్వే నెం.44లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ప్రజలు కొనుగోలు చేయవద్దని, అలా కొన్నవారు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయ, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





