శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన భక్తుడి అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించారు. కంచెర్ల గోపన్న, భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనారు. ఆ భక్త రామదాసు పరంపర వారసుడిగా, శ్రీ రాముడి సేవలో కంచర్ల వెంకట రమణది పదకొండవ తరం. కంచర్ల వెంకట రమణ అనంతమైన భక్తితో, సేవ భావంతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. కంచర్ల వెంకట రమణ అనగానే భద్రాచలం భక్త రామదాసు గుర్తుకు వస్తారు. శ్రీ రామ్ అనగానే హనుమంతుడు గుర్తుకు వస్తాడు.

శ్రీ రామ భక్తుడు హనుమంతుడు అయితే హనుమంతుని ఉపాసకులు, రామదాసు వంశీకులు కంచర్ల వెంకట రమణ. ఆయన ఆధ్యాత్మికంగా, సామాజికంగా వివిధ రకాల కార్యక్రమాలతో, విశ్వహిందూ పరిషత్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణనంద స్వామి సేవకులుగా ఉంటూ, చాగంటి కోటేశ్వరరావు ప్రియ శిష్యుడిగా ఉంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారు. గత ఏడు సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం, శనివారం 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం పలు దేవాలయాలలో జరిగే విధంగా కృషి చేస్తున్నారు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒక సారి లక్ష సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం దేవాలయాలలో జరిగేవిధంగా కృషి చేస్తున్నారు. దీనికి గాను దైవిజ్ఞ శర్మ ప్రశంసా అవార్డ్ లాభించింది.

ఆయన చేసిన సేవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భాష సంస్కృతి శాఖ శివ నంది అవార్డుతో ఘనంగా సత్కరించింది. వీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో రాష్ట్రయ రత్న ఆవార్డుతో సన్మానించారు. గత ఆరు సంవత్సరాలుగా భక్త రామదాసు వంశీకులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంతో నేలకొండపల్లిలో శ్రీ భక్త రామదాసు పుట్టిన ప్రదేశంలో వార్షికోత్సవంలో పాల్గొటున్నారు. కంచర్ల వంశాభివృద్ధి కోసం, గత ఆరు సంవత్సరాల నుంచి భద్రాచలం దేవాలయ గర్భగుడిలో స్వామి సన్నిధిలో అంకుఠిత దీక్షతో సేవలు అందిస్తున్నారు. భక్త రామదాసు వారసులైన ఈయన ఆధ్వర్యంలో భక్త రామ దాసు పరమపదోత్సవం (వర్ధంతి) బృహత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా కంచర్ల వెంకట రమణ చిరకాల సంకల్పం భద్రాచలంలో, నేలకొండపల్లిలో ఒక సత్రం కట్టాలని. అయోధ్య రామాలయం నిర్మాణం సమయంలో తను ముందు ఉండి, దాతల సహకారంతో రెండున్నర కేజీల వెండి ఇటుకను ఇచ్చారు. ఆ తర్వాత ఎనిమిదిన్నర కిలోల వెండి, రెండున్నర తులాల బంగారంతో శంఖుచక్రాలు చెక్కించి దానిపై వజ్రాలతో పొదిగిన పాదుకలకు శ్రీ చల్లా పవన్ కుమార్ పౌండేషన్ ట్రస్టు సహకారంతో అయోధ్య శ్రీ రాముని సేవలో పంపించారు . మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ రామదాసు 393 వ వార్షికోత్సవం సందర్భంగా స్వర భారతి వారి ఆధ్వర్యంలో కంచెర్ల వెంకటరమణ సమక్షంలో గోష్టి గానం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో కూచి డాక్టర్ రమాప్రభ, ప్రతిమ, శశిధర్, ఎస్ జి ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామంలో బస్టాండు వద్ద నిర్మాణం లో ఉన్న శ్రీ రామ భక్త భవిష్యత్తు బ్రహ్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో నిర్మించనున్న హనుమాన్ చాలీసా పారాయణం కోసం జరుగుతున్న 5 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం కౌంట్ లో తమ వంతు గా హనుమాన్ చాలీసా పారాయణం కౌంట్ ఇస్తున్నారు. హిందూ సనాతన ధర్మం పరిరక్షణ లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. భావి తరాలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలుస్తున్నారు.





