శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తిశ్రీనగర్, హఫీజ్‌పేట్ పరిధిలోని సర్వే నంబర్ 150 బై నంబర్‌తో పాటు సర్వే నంబర్ 151 రేగులకుంట ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ జనం కోసం సంస్థ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, ఇరిగేషన్ ఈఈ, రాజేంద్రనగర్ ఆర్డీవోలకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా గతంలో రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం 10-09-2020న నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగా ఫిర్యాదుకు జతచేశారు. ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అధికారులను కోరారు. ఈ విషయమై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ కలిసి రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకారెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. గతంలో ప్రజల భూములను కాపాడినట్టే ఈసారి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తగిన ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ ఆస్తిని రక్షించాలని కోరారు.

అనుమతి తీసుకున్న భూమి సర్వే నెంబర్ 150 – దీప్తిశ్రీనగర్, హఫీజ్‌పేట్ కాగా అక్రమ నిర్మాణం జరుగుతున్న భూమి సర్వే నెంబర్ 151 – రేగులకుంట ప్రభుత్వ భూమి అని, ఈ ప్రభుత్వ భూమిలో బాజాప్తా అనుమతి లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సంస్థ నేతలు ఆరోపించారు. కోర్టు కేసు ఉందన్న నెపంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం చేతులు ముడుచుకుని కూర్చుందని, ప్రజల ఆస్తి కబ్జాను అడ్డుకోడంలో పూర్తిగా విఫలమవుతోందని జనం కోసం నేతలు విమర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని, లేకుంటే ప్రజా ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.





