శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): సందయ్య మెమోరియల్ ట్రస్ట్ & ఆర్‌కేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంషి గూడ, ఎల్లమ్మ బండ జెడ్పీహెచ్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 270 మంది విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, ఆర్‌కేవై ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి, అన్ని రంగాల్లో రాణించి అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. విద్య ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని, ముఖ్యంగా పేద విద్యార్థులకు సహాయం చేయడానికి తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

తన తండ్రి, మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్ ప్రతి సంవత్సరం విద్యారంగంలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న ఈ స్టడీ మెటీరియల్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సూచనలు, సలహాలతో రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించించామని తెలిపారు. విద్యార్థులు ఈ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత చదువుల కోసం తమ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు సర్టిఫికెట్లు భద్రపరుచుకునేందుకు ఫైల్స్ అవసరమని కోరగా, వాటిని కూడా ప్రత్యేకంగా తయారుచేసి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామరాజు, కేశవరావు, నర్సింగ్ యాదవ్, మణిభూషణ్, నరసింహ చారి, వెంకటస్వామి రెడ్డి, నర్సింగ్ రావు, గోపాల్ రావు, ఆంజనేయులు, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, ఎస్.కే.చాంద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.





