- బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన
- అభినందిస్తున్న కోచ్, ప్రాంత వాసులు
- అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడడమే లక్ష్యమని ఆదిత్య వెల్లడి
శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు గాను నిర్వహించిన ప్రాబబుల్స్ మ్యాచ్‌లలో శేరిలింగంపల్లిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంకు చెందిన విద్యార్థి సీవీ చేతన్ ఆదిత్య సత్తా చాటాడు. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్‌గా ఈ మ్యాచ్‌లలో ఆడుతున్న ఆదిత్య ఓ వైపు బ్యాటర్‌గా రాణిస్తూనే మరోవైపు బౌలింగ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రాబబుల్స్ హెచ్ టీం తరఫున ఆడుతున్న ఆదిత్య ఎఫ్ టీంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6వ డౌన్‌లో వచ్చి అద్భుతంగా ఆడాడు. 107 బంతుల్లో 84 పరుగులు చేసిన ఆదిత్య బౌలింగ్‌లోనూ అలరించాడు. 10 ఓవర్లు వేసి వికెట్ తీయకపోయినా కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

కాగా జె టీంతో జరిగిన 2వ మ్యాచ్‌లో ఆదిత్య బ్యాటింగ్‌లో 5వ డౌన్‌లో వచ్చి 94 బంతుల్లో 81 పరుగులు చేయగా, అనంతరం బౌలింగ్‌లో 5 ఓవర్లు వేసి కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో 4 మెయిడెన్స్ ఉండడం విశేషం. అదేవిధంగా ఐ టీమ్‌తో జరిగిన 3వ మ్యాచ్‌లో అతను మళ్లీ 5వ డౌన్‌లో క్రీజులోకి వచ్చి 118 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. 10 ఓవర్లు వేసిన ఆదిత్య కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు నిర్వహించిన మ్యాచ్‌లలో ఓవరాల్‌గా ఆదిత్య 1.53 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ మొదటి స్థానంలో నిలవడం విశేషం. మొత్తం 276 పరుగులు సాధించిన ఆదిత్య టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇలా చేతన్ ఆదిత్య ఆల్ రౌండర్‌గా సత్తా చాటుతూ అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.
ఈ సందర్భంగా అతని కోచ్ రవి అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆదిత్య ఇలాంటి మరెన్నో టోర్నీలకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఆదిత్య మాట్లాడుతూ తన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను మరింత మెరుగు పరుచుకుంటున్నానని, ఏ మ్యాచ్‌లో చాన్స్ వచ్చినా తప్పక సద్వినియోగం చేసుకుంటానన్న నమ్మకం తనకు ఉందని తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడడమే తన లక్ష్యమని అన్నాడు.





