శేరిలింగంపల్లి, జనవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఆదర్శ్ నగర్ కాలనీ రోడ్డు నెంబరు 2లో, బాలాజీ నగర్ శారదా హైస్కూల్ దగ్గర మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందని, పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయని అన్నారు. ఈ పోటీలలో 50 మంది మహిళలు పాల్గొన్నారు. విజయలక్ష్మి, కస్తూరి విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాళ్ళు రాణి, వరలక్ష్మి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






