శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం జరిగే నిత్య కార్యక్రమాల్లో భాగంగా వంద మందికి పైగా భోజన ప్రసాద వితరణ జరుగగా, నిజామాబాద్‌లోని స్కంద మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో గురువు బొడ్డపాటి అశ్లేష మార్గదర్శకత్వంలో శిష్యులు భక్తిశ్రద్ధలతో స్వరార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్యులు ఆదిత్య ఆంజనేయ అనిలజ కీర్తనను గంభీరంగా ఆలపించగా, హసిత భావములోన బాహ్యమునందును, వేదంబెవ్వని వేదికెదిని, మత్స్యకూర్మ వరాహ అనే సంకీర్తనలను శ్రావ్యంగా పాడింది. సాధిక అమ్మమ్మ ఏమమ్మ ఆలమేలుమంగా, శ్రీవల్లి సతులలా ఓ సతులలా చూడరే, శివాని కొలనిదోపరికి గొబ్బిళ్లో కీర్తనలతో భక్తులను ఆకట్టుకున్నారు. సాన్వి కలిగెనిదే నాకు కైవల్యము అన్న సంకీర్తనను భావపూర్వకంగా ఆలపించగా, రోహన్, వజ్రాష్ట్ సంయుక్తంగా రామచంద్రుడితడు రఘువీరుడు అనే కీర్తనను ఉత్సాహంగా వినిపించారు. ఆద్విక చూడరమ్మా సతులలా, శ్రీవిశ్వ గోవింద గోవింద యని కొలువరే అనే కీర్తనలతో స్వరార్చనకు మరింత శోభ చేకూర్చారు. చివరిగా అశ్లేష, నందితశ్రీ, హసితలు కలిసి అప్పని వరప్రసాది అన్నమయ్య, చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం అనే మంగళకీర్తనలను ఆలపించి కార్యక్రమానికి మంగళహారతి స్వరూపాన్ని అందించారు.

శిష్యులందరి ప్రదర్శనలు, సాహిత్య భావం, శ్రుతి–లయ సమన్వయంతో సాగి, విచ్చేసిన భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచాయి. గురువు బొడ్డపాటి అశ్లేష తమ శిష్యులను అన్నమయ్య సాహిత్యంపై అవగాహనతో, సంగీత సాధనలో క్రమశిక్షణతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని పద్మశ్రీ డా. శోభారాజు అభినందించారు. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ కళాకారులకు జ్ఞాపికలను అందించి అభినందించారు. చివరగా భక్తి, సంగీత మాధుర్యంతో సాగిన ఈ స్వరార్చన కార్యక్రమం శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులు సమర్పించి, ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.





