శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో 365 రోజులు సమాజసేవలో ఉంటున్నామని, ఎవరికి అన్యాయం జరిగినా ఎత్తిచూపుతున్నామని, కానీ మనకు జరుగుతున్న అన్యాయానికి ఎవరు అండగా ఉంటున్నారు, ఎవరూ ఉండరని, మనమే మన సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అక్రిడిటేషన్ల విషయంలో మనకు అన్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త ఆక్రిడిటేషన్లు జారీచేయడం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్నారు. సదరు జీవోను సవరించాలని మన యూనియన్ (TUWJ- H143) డిమాండ్ చేస్తుందన్నారు. డిసెంబర్ 27న యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట చేపట్టే ధర్నా కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. అప్పుడప్పుడు మన సమస్యల పరిష్కారానికి కూడా మన సమయాన్ని కేటాయిద్దామనే విషయాన్ని అందరం ఆలోచించాలన్నారు. ఈ జీవో యథావిధిగా ఉంటే శేరిలింగంపల్లిలో ఎంతమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ లు కోల్పోతారో మనం ఊహించగలమని అన్నారు.





