శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): గౌడ్స్ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (GOPA) గోల్డెన్ జూబ్లీ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య, శ్రీకాంత్ గౌడ్ లతో కలసి గోపా హెల్త్ కార్డ్ ను ఆవిష్కరించారు. టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సేవ చేసే గుణం కేవలం గౌడ్స్ లోనే ఉంటుందని, గోపా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలని, గోపా భవన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. గోపా ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేయాలని, గోపా నిధికి తన వంతు సహాయంగా అంకురార్పణగా రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇవ్వడం జరిగిందని, కులవృత్తులకు శిక్షణ తరగతులు, విద్యార్థులకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. గౌడ భవనం ఏర్పాటుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ. 5 కోట్ల నిధులను ఇవ్వడం జరిగిందని, గౌడ్స్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వైన్స్ షాప్ లలో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని, గౌడ్స్ కులవృత్తి ఆత్మగౌరవం పెంపొందించడం కోసం ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్ ను ఏర్పాటు చేసి, నీరా, ఈత, తాటి ఉత్పత్తుల అమ్మకానికి స్టాల్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్ మాట్లాడుతూ సంఘాలన్నింటిని ఏకం చేసే సంఘం కావాలని, గౌడ మహాసభ ఏర్పాటుకు కృషి చేయాలని, హక్కుల కోసం ఏ ఉద్యమం చేయలేక పోవడం వల్లనే రిజర్వేషన్లు వెనక్కి పోయాయని అన్నారు.

జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ బెంగాల్ ప్రాంతంలో గౌడరాజులు ఉన్నారని, కల్లుగీత ద్వారా విడిపోయి నేడు తెలంగాణలో 30 లక్షల గౌడ సంఖ్య ఉందని గోపా ద్వారా 5 లక్షల సభ్యత్వం చేయించి వచ్చే రుసుము ద్వారా విద్యాసంస్థలను నిర్వహించి గౌడ పేదలకు, సమాజ సేవకు మాత్రమే వినియోగిస్తే మంచిదని సూచించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష వెలిబుచ్చారు. తద్వారా గౌడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందుకు కుల ఐక్యత ముఖ్యమని సూచించారు. అనంతరం సుప్రజ హాస్పిటల్ గోప ద్వారా సభ్యులందరికీ హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 10 కుటుంబాల వద్దనే ఐదు లక్షల కోట్ల సంపద ఉందని, వెనుకబడిన తరగతులైన మన వద్ద అంత సంపద లేదని, కులం, అధికారం, సంపద ఈ మూడింట్లో మనం ముందుండాలని అన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగంగా ఉన్నందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని, ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు.
ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులమని గర్వంగా చెప్పుకోవాలని, ఎవరు చేయని పనిని మనం చేస్తామని, గ్రామంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు నెలకొల్పడంలో గౌడ కులం అగ్రగామిగా ఉంటుందని అన్నారు. పి ఎస్ సి సభ్యురాలు బాలలక్ష్మి మాట్లాడుతూ గోపాలో మహిళల ప్రాధాన్యతను పెంచాలని, జనరేషన్ పరంగా ఐక్యత ముఖ్యమని కోరారు. మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాట్లాడుతూ గోపాను విస్తరిస్తూ గీత కార్మికుల పరిస్థితులపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 22 జిల్లాల నుండి జిల్లా బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపా అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి జి వి శ్రీనివాస్ గౌడ్, రఘునాథ్ గౌడ్, చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్, చక్రవర్తి గౌడ్, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





