శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న గంగారం చెరువు నుంచి వచ్చే గొలుసు కట్టు నాలా కబ్జాకు గురవుతుందని, వెంటనే కబ్జాను ఆపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు శేరిలింగంపల్లి మండల సీపీఎం కార్యదర్శి సి.శోభన్, జోన్ కార్యవర్గ సభ్యులు వి.మాణిక్యం, కె.కృష్ణ, ఎన్.వరుణ్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు నాలాను కబ్జా చేసి ఓ బిల్డర్ భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాడని అన్నారు.

బిల్డర్ నాలాను మొత్తం కబ్జా చేసి నాలాపై స్లాబ్‌ను కూడా నిర్మించాడని, కబ్జా వల్ల నాలా కుచించుకుపోయిందని అన్నారు. ఇంతగా కబ్జా అవుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. ఇటీవల శ్రీచైతన్య కాలేజ్ యాజమాన్యం ఇదే నాలాలను మియాపూర్‌లో కబ్జా చేస్తే హైడ్రా అధికారులు తొలగించారని గుర్తు చేశారు. కనుక చందానగర్‌లో కబ్జాకు గురవుతున్న ఇదే నాలాను కూడా రక్షించాలని, వర్షాకాలంలో భారీ వరదల నుంచి సమీపంలో ఉన్న ప్రజలను కాపాడాలని కోరారు.





