శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావన వాహిని ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. శోభారాజు నిర్వహించిన తందనాన – గ్రాండ్ ఫైనల్స్ ఘనంగా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ముందుగా విష్ణు సహస్రనామ పారాయణంతో ప్రారంభమై, అనంతరం సన్నాయి, మేళం, వేద పఠనంతో భక్తి వైభవంగా నిర్వహించబడింది. తదుపరి అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు హరి అవతారమీతడు, నడిచే వాత్సల్యం, శ్రీ చిన్నజీయర్ స్వామి అన్నమాచార్య కీర్తనలను శ్రీ చిన్నజీయర్ స్వామి సమక్షంలో ఎంతో భక్తి భావంతో, శ్రద్ధగా ఆలపించారు. అనంతరం గ్రాండ్ ఫైనల్‌కు ఎంపికైనవారు సిన్నెక్క, రాజీవలోచనాయ, కొండలలో నెలకొన్న, తిరుమల గిరిరాయ వంటి అన్నమాచార్య సంకీర్తనలతో పాటు మరికొన్ని కీర్తనలను ఆలపించగా, మొత్తం 12 మంది పాల్గొనేవారు ఈ దశలో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలకు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని సునీత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, పాల్గొన్న కళాకారులకు అమూల్యమైన సూచనలు, సలహాలు అందిస్తూ ప్రోత్సహించి ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రముఖ గాయని గాయత్రి హాజరై విజేతలను అభినందించారు. ఫైనల్స్ డిసెంబర్ 23వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించబడనున్నాయని తెలిపారు. ఎంపికైన విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సువర్ణ పతకాలను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీ చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ గ్రాండ్ ఫైనల్‌లో పాల్గొన్న పిల్లలు, కళాకారులను ప్రశంసిస్తూ, ఈ తరానికి మైకేల్ జాక్సన్ సంగీతం ఎంత ప్రభావవంతమో, అదే విధంగా అన్నమాచార్య కీర్తనలు డా. శోభారాజు ద్వారా ప్రపంచమంతా మారుమ్రోగుతున్నాయి అని వ్యాఖ్యానించారు.

ఈ తరంలోని పిల్లలు కళలను అభ్యసించడం వల్ల శాంత స్వభావంతో, పెద్దల పట్ల గౌరవభావంతో ఎదుగుతున్నారని తెలిపారు. పిల్లలు తప్పకుండా కళలను నేర్చుకొని, మంచి మార్గంలో ప్రయాణిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ డా. శోభారాజు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఆమె గాన స్వరం, పాటల లోతు తనను ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ పాల్గొన్న ప్రతిభావంతులను ప్రశంసిస్తూ, భక్తి సంగీతం ద్వారా మన సంస్కృతి పరిరక్షణ జరుగుతోందని పేర్కొన్నారు. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎంతో ప్రాచుర్యం పొందిన కొండలలో నెలకొన్న అన్నమాచార్య కీర్తనను ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ కీర్తన ఈ కార్యక్రమంలో ఆలపించబడిన విధానాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.

చివరగా పద్మశ్రీ డా. శోభారాజు ఈ కార్యక్రమం గురించి, శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశీస్సుల గురించి, పాల్గొన్న కళాకారులు, ABV విద్యార్థుల కృషి గురించి ప్రశంసిస్తూ తన మాటలను తెలియజేశారు. అంతిమంగా ABV విద్యార్థులు తందనాన అన్నమాచార్య కీర్తనను ఆలపించి, అందరినీ ఆకట్టుకుని కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.





