శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి మంజీర డైమండ్ హైట్స్‌లో గో హెల్త్ క్లినిక్స్, ఎన్ఆర్ విజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా, కార్పొరేట్ వైద్య సంస్థలు సమాజంపై తమ బాధ్యతను గుర్తించి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తరచూ ఇలాంటి ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా కంటి ఆరోగ్యం, సాధారణ వ్యాధుల పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ వంటి సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అపార్ట్మెంట్ సభ్యులు, వైద్యులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






